Politics

పోటీకి సై అంటున్న రాముల్లమ్మపై కాంగ్రెస్ లో సీరియస్… కొత్త రాజకీయం వర్క్ అవుట్ అవుతుందా?

స్టార్స్ పోటీ చేస్తే,ప్రచారం చేస్తే తిరుగుండదని అంటుంటారు. కానీ కొందరి విషయంలో ఇది రివర్స్ కూడా అవుతుంది. వన్నె తగ్గిన వాళ్ళ ప్రచారం ఇబ్బంది కలిగిస్తుందని,ఇక పోటీ కూడా చేస్తే అంతేసంగతులని అంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఇంతకీ వీళ్ళు చెప్పేది రాములమ్మ విజయశాంతి గురించి అని చెప్పాలి. టిఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన విజయశాంతి ఇన్నాళ్లూ పోటీకి దూరం అంటూ వచ్చింది. స్టార్ కాంపైన్ గా చేసుకోవాలని కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నారు. తీరా పరిస్థితిలో ఇప్పుడు తేడా కొట్టింది. తనుసైతం పోటీకి సై అంటూ టికెట్ కోసం తీవ్రంగా విజయశాంతి యత్నాలు సాగిస్తోంది.

రాజకీయంగా మళ్ళీ కీలకం కావాలని ఆమె ఎత్తుగడ. అయితే ఇది కాంగ్రెస్ నేతలకు రుచించడం లేదు.అసలు ప్రచారం చేస్తేనే ఓట్లు రాలవని,అలాంటిది పోటీచేస్తే సీటు చేజేతులా పోగొట్టుకున్నట్టేనని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే పోటీచేస్తే గెలవడం ఖాయమని,అనవసర రాద్ధాంతం ఎందుకని రాములమ్మ అనుచరులు అంటున్నారు.

సర్వే చేసాక ఆమె గెలిచే స్థానంలో బరిలో దింపాలని కొందరు పెద్ద నాయకులు ముందు భావించారట. ఫలితంగా ఆమె మెదక్ నుంచి బరిలో దిగుతారన్న ప్రచారం ఊపందుకుంది. దుబ్బాక అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తే మంచిదని కొందరు నాయకులు చెప్పారట. ఇప్పటికే ఆమెకు ప్రచార బాధ్యతలు అప్పగించడం కూడా ఇష్టం లేని కొందరు నాయకులు ఇక పోటీ కూడానా అని పెదవి విరుస్తున్నారట.

దుబ్బాక నుంచి పోటీ చేస్తే,రాములమ్మ గెలిచేందుకు ఎక్కువ ఛాన్స్ ఉందని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే టిఆర్ ఎస్ ఈ జిల్లాలో బలంగా ఉందని అలాంటప్పుడు రాములమ్మ పోటీచేస్తే కల్సి వస్తుందని అంటున్నారు. గతంలో మెదక్ ఎంపీగా పోటీచేసి, గెలిచిందని కూడా అంటున్నారు. అయితే ఇలా కొన్ని సామాజిక వర్గాలు భావిస్తుంటే, మరికొన్ని సామాజిక వర్గాలు ఇలాంటి సమయంలో ఒక్క సీటు పోయినా ప్రమాదమని,అందుకే రాములమ్మను పోటీకి దూరంగా ఉంచి కాంపైన్ కి పరిమితం చేయాలని వాదిస్తున్నారు.

ఇప్పటికే ఈ జిల్లానుంచి దామోదర రాజనరసింహ పోటీచేసున్నారని,ఇక విజయశాంతి కూడా ఈ జిల్లానుంచే పోటీ పడితే ఎక్కువ దృష్టి పెట్టాలని అందుకే ఆమెకు టికెట్ వద్దని కొందరు గట్టిగా వాదిస్తున్నారు. ఓట్లు సీట్లు ప్రాతిపదికన ప్రతి సీటుపై దృష్టి పెడ్తున్నందున జాగ్రత్తగా వ్యవహరించాలని మరికొందరు సూచిస్తున్నారట. మొత్తానికి విజయశాంతి వ్యవహారం పెద్ద సమస్య తెచ్చిపెడుతోంది.