Movies

శ్రీమంతుడు విలన్ హరీష్ ఊతమన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

సినిమా అంటేనే చిత్ర విచిత్ర విన్యాసాలు. రంగుల ప్రపంచం, కొందరి ఎదుగుదలకు మెట్టులాంటిది. మరికొందరికి నిరాశాజనకం. ఇలా ఎన్నో ఉంటాయి. ఇక నటన అనే ఆసక్తి మనసులో ఉండాలి గాని అది ఎక్కడో అక్కడ వెలుగు చూడడం ఖాయం. ఆతర్వాత నిలబెట్టుకోవడాన్ని బట్టి,అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఇంట్రెస్ట్ తో వచ్చినవాళ్లు సినీ రంగంలో ఎందరో దర్శనమిస్తారు. ఇక ఇదే కోవకు చెందిన వ్యక్తి తమిళనాడుకు చెందిన హరీష్ ఊతమన్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు మూవీ సూపర్ డూపర్ అయింది. ఇందులో విలన్ గా వేసిన వ్యక్తి ఎవరో కాదు హరీష్ ఊతమన్.

తెలుగులో రవితేజతో పవర్, గోపీచంద్ తో జిల్,రామ్ తో పండగ చేసుకో,శర్వానంద్ తో ఎక్స్ ప్రెస్ రాజా,సూపర్ స్టార్ మహేష్ బాబుతో శ్రీమంతుడు, అల్లు అర్జున్ తో డీజే, నాపేరు సూర్య వంటి సినిమాల్లో చేసి, హీరోలకు ధీటుగా నటించాడు. పారామౌంట్,బ్రిటిష్ ఎయిర్ లైన్స్ లో ఎన్నో ఏళ్ళనుంచి పనిచేస్తున్న హరీష్ ఊతమన్ కి తాను చేసే ఉద్యోగం నచ్చకపోవడం,సినిమాల్లోకి రావాలని కలలు కనడం వలన మొత్తానికి అది నెరవేరింది.

స్టడీస్ సమయంలో మోడల్ గా కూడా చేసాడు. దాంతో సినిమా వైపు వెళ్లాలనే కోరిక పుట్టించింది. నిజానికి ఎయిర్ పోర్టులో ఎందరో సినీ తారలు, సెలబ్రిటీలు తారస పడతారు. ఇక ఒకరోజు అదృష్టం హరీష్ ని వెతుక్కుంటూ వచ్చింది. ఓ తమిళ డైరెక్టర్ విమానం ఎక్కినపుడు తారసపడ్డ హరీష్ ని చూసి నువ్వు చూడ్డానికి చాలా బాగున్నావ్ సినిమాల్లో నటిస్తావా అని అడిగేసరికి ఎగిరి గంతెస్తూ ఒకే చెప్పేయాలని అనుకున్నాడు.

కానీ నాలుగు రోజులు ఆగి చెబుతానని గడువు అడిగాడు. అలా ఇంట్లో వాళ్లకు చెప్పడం,వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినీ రంగంలోకి వచ్చేసాడు. ఇక ఆహ్వానించిన డైరెక్టర్ సూర్య ప్రభాకరన్ డైరెక్షన్ లో 2010లో తా అనే సినిమాలో హరీష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కమర్షియల్ గా రాణించకపోయినా, నార్వే తమిళ ఫిలిం ఫెస్టివల్ లో హరీష్ నటనకు బెస్ట్ అవార్డు వచ్చింది. అదే ఫిస్టవల్ కి వచ్చిన తెలుగు డైరెక్టర్ రాధామోహన్ తెలుగులో గౌరవం అనే సినిమాలో నెగెటివ్ పాత్ర వేయించటంతో హ్యాండ్సమ్ విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు.

ఆ తర్వాత ఓ ఇంటర్యూలో రఘువరన్ ని మించిన విలన్ గా గుర్తింపు పొందుతానని చెప్పడం అతని దూరదృష్టికి నిదర్శనం. విశాల్ హీరోగా వచ్చిన పందెం కోడిలో కూడా విలన్ గా నటించాడు. ఇదే సినిమా తమిళనాట పాండ్యానాడు పేరిట విడుదలై, బ్లాక్ బస్టర్ కొట్టింది . విశాల్ తో పాటు హరీష్ కి కూడా విలన్ గా స్టార్ డమ్ తెచ్చింది. ఆవిధంగా తెలుగు, తమిళ భాషల్లో మోస్ట్ వాంటెడ్ హ్యాండ్సమ్ విలన్ గా బిజీ అయిపోయిన హరీష్ 8ఏళ్ళల్లో30కి పైగా సినిమాల్లో నటించాడు.