Movies

అపవాదు భరించలేక అక్కినేని రెండుసార్లు సముద్రంలో దూకబోయారు

ఒక్కోసారి నిందలు భరించడం కన్నా ఈ లోకం నుంచి వెళ్లిపోవడం మంచిదని అనుకుంటారు కొందరు. వాటిని ఎదుర్కోవడం అలవర్చుకోవాలని అంటారు మరికొందరు. కానీ అందరికీ ఆస్థాయిలో మానసిక స్థైర్యం ఉండదు కదా. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు కూడా అపవాదులు,నిందలు భరించలేక సముద్రంలో దూకేసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఏదో ఒకేసారి కాదు రెండు సార్లు అదే పరిస్థితి వచ్చిందట. కృష్ణా జిల్లా వెంకట రాఘవాపురం గ్రామానికి చెందిన అక్కినేని కి నాలుగేళ్ల ప్రాయంలోనే తండ్రి చనిపోయాడు. అన్నదమ్ముల ఆస్థి పంపకాల్లో ఒక్కొక్కరికి ఐదెకరాలు వచ్చాయి. అప్పట్లో ఎకరా 600ధర పలికేది. వాళ్ళింట్లో ఎవరికీ చదువు రాదు. ఉన్న పొలం అమ్మేస్తే వచ్చే 3000వేల రూపాయలతో చదివిస్తే ఉద్యోగం వస్తుందో రాదో గ్యారంటీ లేదు.

అసలు చదువు అబ్బుతుందో లేదు తెలీదు. అందుకే ఉన్నదంతా ఖర్చు పెట్టేస్తే బతకడం ఎలా అని అక్కినేని తల్లి ఆలోచించింది. కోలాటం,పాటలు అంటున్నాడు వాటిలో అయినా పైకి వస్తాడేమోనని అనుకుంది. అందుకే నాటకాల్లో చేర్పించమని వాళ్ళ అన్నయ్యతో చెప్పడంతో 9వ యేట రంగస్థలం మీదికి వచ్చాడు. అప్పుడు వేసుకున్న నాటకాల రంగు 19ఏళ్ళు వచ్చేవరకూ కొనసాగింది.

మొదటి నాటకానికి అర్ధరూపాయి దక్కితే, ఆఖరి నాటకానికి 5రూపాయలు వచ్చింది. ఇక మెల్లిగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ఇక పెళ్లి చేసుకుందామంటే పిల్ల దొరకలేదని,అప్పట్లో సినిమా వాళ్ళకి ఎవరూ పిల్లనిచ్చేవారు కాదని, ఈ ఫీల్డ్ లో చెడిపోడానికి పుష్కలంగా ఛాన్స్ లు ఉండడమే అందుకు కారణమని అక్కినేని ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు.

మేనమామ కూతురిని కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదట. ఇక ఎక్కడైనా పిల్ల దొరుకుతుందేమోనని వెదికినా ఫలితం దక్కలేదు. ఓరోజు పేకాట సమయంలో అక్కినేని మామగారు తమ కూతురికి మంచి సంబంధం ఉంటె చెప్పమని అడగడంతో అందరూ అక్కినేని పేరు చెప్పారట. ఇంట్లో వాళ్ళు , బంధువులు వద్దన్నారట. అయితే అక్కినేనిని ఆయన మామగారు నమ్మి పెళ్ళిచేసారు. అలా ఆయన జీవితంలోకి అన్నపూర్ణ ప్రవేశించారు. అక్కినేనిని కళాప్రపూర్ణ గా మలిచారు.

అక్కినేని ఆలోచనలను అర్ధం చేసుకోవడం,ఆచరణలో పెట్టేలా చేయడంలో అన్నపూర్ణ ఓ మంచి స్త్రీగా తన పాత్రను పోషించారు. చుట్టూ అమ్మాయిలున్నా ఏమాత్రం చలించేవాడు కాదు అక్కినేని. ఆ సమయంలో నపుంసకుడు అని, వీడు మగాడే కాదు, ఆడపిల్లలను చూడడు,మాట్లాడడు అని అందరూ కామెంట్స్ చేస్తుంటే అక్కినేని ముడుచుకుపోయేవాడట. ఈ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని రెండుసార్లు సముద్రం దగ్గరకు కూడా వెళ్ళాడట.

మరి అదే సమయంలో అన్నపూర్ణ అక్కినేని జీవితంలో ఎంటర్ అవ్వడమే కాదు,ఎంతో సంతోషాన్ని అదృష్టాన్ని వెంటబెట్టుకొచ్చింది. హీరోల భార్యలకు ఓర్పు ఉండాలి,అందునా అక్కినేని లాంటి రొమాంటిక్ హీరో భార్య కి ఇంకా ఎక్కువ ఓర్పు అవసరం. తోటి నటులు,చుట్టుపక్కల వాళ్ళూ,మీ అయన భలే నేచురల్ గా చేస్తారండి, అంటూ అన్నపూర్ణను రెచ్చగొట్టిన సందర్భాలున్నాయి.

కానీ ఆమె ఏనాడూ రెచ్చిపోలేదు. పైగా చల్లని చూపు ప్రసరింపజేస్తూ ఉన్నతికి దోహదపడింది. ఇక అక్కినేని సినిమాలతో తిరుగుతుంటే పిల్లలను పెంచి పెద్దచేసిన ఘనత అన్నపూర్ణదే. పిల్లలకు ఆంక్షలు పెట్టడం కానీ,శాసించడం కానీ చేయలేదు. నాగార్జున అంటే ఆమెకు ఎంతోప్రేమ,ఆమె అంటే కూడా నాగ్ కి అంతేప్రేమ ఇక తల్లిలేని సుమంత్ ని కూడా ఆమె పెంచి పెద్దచేసింది.