Politics

ఇంతకీ అలీ మనసులో ఏముంది – ఏ పార్టీలో ఉంటాడో… అసలు క్లారిటీ ఉందా?

సిల్వర్ స్క్రీన్ మీద కామెడీ తో అలరిస్తూ,టివి షోస్ లో కూడా తనదైన మార్క్ చూపిస్తున్న స్టార్ కమెడియన్ అలీ ఇప్పుడు పొలిటికల్ తెర మీద కూడా కామెడీ పంచేస్తున్నాడు. లేకపోతె మూడు పార్టీల నేతలతో భేటీ అవుతూ వీరి వీరి గుమ్మడి పండులా ఆట ఆడేసుకుంటున్నాడు. ఇన్నాళ్లూ టిడిపి మద్దతు దారుడిగా వ్యవహరిస్తూ వచ్చిన అలీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడ్డాడు. మరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో దూసుకెళ్తూ,వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లకు పోటీచేయాలని భావిస్తున్నాడు. అలాంటప్పుడు అలీ జనసేన లో చేరడం ఖాయమని ముందు నుంచి అంతా లెక్కలు వేసుకున్నారు.

కానీ అందరి అంచనాలను తారుమారుచేస్తూ వైసీపీ అధినేత జగన్ తో అలీ భేటీ అయ్యి రాజకీయాల గురించి చర్చించడం… సంచలనం కల్గించింది. ఇంకేముంది ఆలీ వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడని కాదు కాదు రాజమండ్రి అసెంబ్లీలో స్థానం నుంచి పోటీ చేస్తున్నాడని, ఈ మేరకు జగన్ నుంచి హామీ కూడా వచ్చిందని ఇలా వరుస కధనాలు ప్రచారం అయ్యాయి.

ఇంతలోనే అకస్మాత్తుగా టిడిపి అధినేత చంద్రబాబుతో అలీ భేటీ అవ్వడం అందరికి షాక్ ఇచ్చింది. ముందునుంచీ బంధం గల టిడిపి లో అలీ చేరబోతున్నాడని, గుంటూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. హమ్మయ్య క్లారిటీ వచ్చిందని అందరూ అనుకుంటున్న తరుణంలో మళ్లీ అందరికి ట్విస్ట్ ఇస్తూ పవన్ కళ్యాణ్ తో అలీ మరోసారి భేటీ అవ్వడం తో మరో ట్విస్ట్ ఇచ్చినట్లయింది. అసలు ఆయన ఏ పార్టీలో చేరతారని అంతా జుట్టు పీక్కున్నారు.

తాజాగా మళ్లీ చంద్రబాబుతో భేటీ అవడం మరింత గందరగోళానికి గురి చేసింది. ఈ కామెడీ స్టార్ పొలిటికల్ గేమ్ ఎవరికి అర్థం కాక అంతా అయోమయంలో పడిపోయారు. అయితే అలీ టిడిపిలో చేరడం ఖాయమని గుంటూరు తూర్పు టికెట్ పై చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రాగానే పార్టీలో చేరుతారని తెలుగు తమ్ముళ్లు కొంతమంది డిక్లేర్ చేసారు.అయితే అలీ మాత్రం తాను చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిశా చెప్పుకొచ్చాడు.

మొత్తానికి అలీ మనసు మాత్రం గుంటూరు తూర్పు అసెంబ్లీ టికెట్ పైనే ఉందట. ఈ నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు అత్యధికంగా ఉండడంతో ఆ టిక్కెట్ ఇవ్వాలంటూ చంద్రబాబు దగ్గర అలీ ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది.తనకు గుంటూరు వన్ / విజయవాడ వన్ అదీ కుదరకపోతే తన స్వస్థలం రాజమండ్రి అసెంబ్లీ సీటుతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తానని హామీ ఇచ్చిన పార్టీలోనే తాను చేరతానని మొహమాటం లేకుండా అలీ చెప్పేస్తున్నాడట. ఇక తనకు ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితంగా ఉన్న మాగంటి మురళీమోహన్, అశ్వినీ దత్ వంటి వారితో టికెట్ విషయంలో చంద్రబాబు దగ్గరకు రాయబారం నడిపిస్తున్నాడు.

వాస్తవానికి అలీ టీడీపీ లోనే ఉన్నా,మొదటి నుంచి యాక్టివ్ గా లేరు. నిజానికి అలీ టీడీపీ లో ఉన్నట్టే చాలా మందికి తెలియదు. ఇప్పుడు అలీ కోరుతున్న సీట్లు లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు బలంగా ఉండడంతో, వారిని తప్పించి ఆలీకి టికెట్ ఇవ్వడం పెద్ద తలనొప్పి వ్యవహారమే. అందుకే ఈ విషయంలో చంద్రబాబు కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని తెలుస్తోంది.

అయితే అలీ మాత్రం ఒక్క మెట్టు కూడా దిగేలా లేడట. తాను కోరిన ఆఫర్లను ఇచ్చిన పార్టీ లో చేరతానని బల్లగుద్ది మరీ చెప్పేస్తున్నాడు. అందుకే ఈ మూడు పార్టీల చుట్టూ తిరుగుతూ…. తన డిమాండ్లను ఆయా పార్టీల నేతల ముందు ఉంచుతూ పొలిటికల్ ట్విస్ట్ లు ఇస్తుంటే, ఇదేం కామెడీ అంటూ పొలిటికల్స్ క్రిటిక్స్ చురుకలాంటిస్తున్నారు.