దాసరి – కోడి రామకృష్ణ ల మధ్య మనకు తెలీని నమ్మలేని విషయాలు
తెలుగు సినీ పరిశ్రమలో 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన నలుగురి దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. కుటుంబ కథలను, ఫాంటసీ కథలను తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన ఈయన నాటకాలతో తన కెరీర్ను ప్రారంభించి దర్శకుడిగా అత్యున్నత శిఖరాలను అందుకున్నారు. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు దగ్గర శిష్యరికం చేసి గురువుని మించిని శిష్యుడయ్యారు. దాసరి 100చిత్రాలు డైరెక్ట్ చేస్తే,కోడి రామకృష్ణ కూడా వంద చిత్రాలు దాటి డైరెక్ట్ చేసారు. దాసరి కొలువు నుంచి ఎందరో దర్శకులు బయటకు వచ్చినా అందులో కోడి రామకృష్ణ అంటే దాసరికి ప్రత్యేక అనుబంధం. కోడి రామకృష్ణ సినిమా హిట్ అయితే అది తన విజయంగా దాసరి భావించేవారు. ఇది మన కాంపౌండ్ సినిమా పండగ చేసుకుందామా అని దాసరి అనేవారట.
దాసరి నారాయణరావు తొలిచిత్రం ‘తాత మనవడు’ చూశాక రామకృష్ణకు దర్శకత్వ శాఖలో పని చేయాలని అనుకున్నారు. ఆ సినిమా అర్ధశతదినోత్సవం పాలకొల్లులో జరిగిన సందర్బంగా దాసరి వద్ద పనిచేయాలన్న తన కోరిక బయటపెట్టారు. డిగ్రీ పూర్తిచేసుకుని వస్తే చూద్దామనడంతో రామకృష్ణ డిగ్రీ పూర్తిచేసుకుని ఆ విషయాన్ని దాసరికి ఉత్తరం రాయడం, వెంటనే బయలుదేరమంటూ దాసరి నుంచి టెలిగ్రాం రావడం జరిగాయి. వెంటనే మద్రాసు బయలుదేరారు.
ఒక సినిమా హిట్ అయితే డైరెక్టర్ కి పేరు వస్తుందని గుర్తించిన కోడి రామకృష్ణ ఆదిశగా అడుగులు వేశారు. ‘ఎవరికి వారే యమునా తీరే’, ‘స్వర్గం నరకం’, ‘మనుషుల్లో దేవుడు’ సినిమాలకు కోడి రామకృష్ణను ఒకేసారి అసిస్టెంట్ గా తీసుకున్నారు. అలా దాసరి నటించిన శివరంజని వంటి పలు చిత్రాలకూ దర్శకత్వ శాఖలో పనిచేశారు. 1979లో కోరికలే గుర్రాలైతే చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా కోడి రామకృష్ణ పనిచేశారు. టాన్గ్రో హోటల్ లో ఆరు గదులుంటే వాటికి కోడి రామకృష్ణ ఇంఛార్జిగా ఉండేవారట.
ఒకసారి హోటల్ వాళ్ళతో పడకపోతే మరో హోటల్ లో దాసరి భోజనం టికెట్స్ ఇప్పించారట. అయితే అక్కడికి వెళ్లి తినడానికి కూడా కోడి రామకృష్ణకు తీరుబడి ఉండేది కాదట. అందుకే వాటిని పేదలకు ఇచ్చి కడుపు నింపేవారట.దాసరి స్టార్ హోటల్ లో బసచేసి తనతో ఉండమంటే,తనకు ఇబ్బందిగా ఉండేదని కోడి రామకృష్ణ చెప్పుకొచ్చారు. చిల్లరకొట్టు సినిమాలో డైలాగులు రిపీట్ అయిన విషయం కో డైరెక్టర్ కి చెబితే వ్యతిరేకత వచ్చిందని,దాంతో అర్ధరాత్రి రెండు గంటల వేళ దాసరి ఇంటికి వెళ్లి చెబితే ఆయన అర్ధం చేసుకుని మార్పులు చేయడంతో ఆసినిమాకు మంచి పేరువచ్చిందని కోడి రామకృష్ణ ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు.
అలాగే శివరంజని సినిమాలో కూడా క్లైమాక్స్ లో కొన్ని మార్పులు చెబితే దాసరి ఆమోదించారట. ఈవిధంగా తన గురువుతో అనుబంధం గుర్తు చేసుకున్నారు. . సినీ రంగంలో ఇన్ని హిట్స్ ఇచ్చానంటే అది అంతా దాసరి చలవేనని కోడి రామకృష్ణ చెబుతారు. సినిమా సినిమా అని తపించడం తప్ప ఎక్కడా రాజకీయ పోకడలకు తావివ్వని దర్శకుడు కోడి రామకృష్ణ అని చెప్పాలి. చివరి వరకూ ఆయన అదే పంధాలో వెళ్లారు. లో ప్రొఫైల్ లో వెళ్లడం ద్వారా లెజండరీ డైరెక్టర్ అయ్యాడు. తన సినిమా కథ ఎలా నడుస్తుందో తన జీవితం కూడా అలాగే నడిచిందని ఆయన వివరించారు.