నాగ సినిమాలో అనసూయ కనిపించడానికి కారణం ఏమిటో తెలుసా?
అనసూయ అంటే గత పదేళ్లుగా అందరికీ తెలుసు కానీ దాదాపు 16 ఏళ్ల కింద ఈమె తెలుగు సినిమాలో కనిపించింది. కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నాగ సినిమాలో ఈమె కెమెరా ముందుకు వచ్చింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. తెలిసినా కూడా పెద్దగా పట్టించుకోలేదు.
ఎందుకంటే అప్పటికి అనసూయ ఎవరికీ తెలియదు కాబట్టి. అయితే నాగ సినిమాలో ఎందుకు నటించిందో ఎవరికీ అర్థం కాలేదు. కొందరైతే ఏకంగా ఆమె అప్పటినుంచి ఇండస్ట్రీలో ఉందని.. అవకాశాల కోసం వేచి చూస్తుందని అనుకున్నారు. కానీ ఆ సినిమాలో తాను ఎందుకు కనిపించాల్సి వచ్చిందో ఇప్పుడు అసలు కారణాలు చెప్పింది అనసూయ.
నిజానికి ఈమె చదువుకున్నది ఉప్పల్ కాలేజీలో. అప్పట్లో నాగ సినిమా షూటింగ్ అక్కడే జరిగింది. దానికి కొందరు అమ్మాయిల గుంపు కావాలంటూ దర్శకుడు కోరడంతో అక్కడే ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ ని తీసుకు వచ్చారు అసిస్టెంట్స్. అందులో అనసూయ కూడా ఉంది. చూడటానికి పొడుగ్గా, అందంగా ఉండటంతో ఎక్కడో దూరంలో నిలబడి ఉన్న అనసూయను తీసుకువచ్చి కెమెరా ముందు సునీల్ పక్కన నిలబెట్టాడు అసిస్టెంట్ డైరెక్టర్. దానికి తోడు 500 రెమ్యూనరేషన్.. ఇడ్లీ, వడ టిఫిన్ పెట్టడంతో తాము కూడా ఈ సినిమాలో సరదాగా ఉంటుందని నటించినట్లు చెప్పింది అనసూయ.
ఇదే విషయం ఇంటికి వెళ్లి అమ్మకు చెబితే హ్యాపీగా ఫీల్ అయిందని.. కానీ నాన్నకు మాత్రం చెప్పలేదని తన జీవితంలో జరిగిన ఒక సరదా సంఘటన గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది అనసూయ. ఇక ఆ తర్వాత కొన్నేళ్ల గ్యాప్ తీసుకుని సాక్షిలో న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలు పెట్టడం.. జబర్దస్త్ కు రావడం.. అక్కడి నుంచి అనసూయ జాతకం మారిపోవడం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈమె యాంకర్ గానే కాకుండా అద్భుతమైన నటిగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.