Politics

పవన్ పొలిటికల్ ఆశలపై నీళ్లు !

సరికొత్త రాజకీయాన్ని తెరమీదకు తెచ్చేందుకు జనసేన పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు ఏపీలో జరిగిన తాజా ఎన్నికలు చేదు అనుభవం మిగల్చబోతున్నాయా? పవన్ ఆశలపై నీళ్లు పడ్డాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. నిన్నటి రోజున ఈ విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. అసలు కొన్ని సంస్థలయితే జనసేన ప్రస్తావనే లేకుండా ఫలితాల ప్రకటన చేయడం జనసైనికులకు మింగుడు పడ్డం లేదు. తాను సీఎం పీఠం మీద కూర్చోవడం ఖాయం అని జనసైనికులు హడావుడి చేస్తుంటే ఆ పార్టీకి నాలుగు లేక ఐదు సీట్లకు మించి సీన్ లేదని ఎగ్జిట్ పోల్స్ చెప్పేసాయి.

ఏపీలో ఎన్నికలు ముగిసినప్పటి నుంచి జనసేన పార్టీ వర్గాలు తమ పార్టీ కింగ్ మేకర్ స్థానంలో ఉంటుందని , పవన్ సీఎం అవ్వడం ఖాయం అని చెప్పుకొస్తున్నారు. ఇక లగడపాటి రాజగోపాల్ ఫ్లాష్ టీమ్ సర్వేలో జనసేన రెండు నుంచి మూడు సీట్లకు అటు ఇటుగా వస్తాయని చెప్పేసింది. ఏపీలో జనసేనకు 11 శాతం ఓట్లు పడ్డాయని, ఆ పార్టీకి ఒక లోక్ సభ స్థానం మాత్రమే రాబోతోందని లగడపాటి సర్వే చెప్పుకొచ్చింది. ఇక జాతీయ సర్వేలు జనసేన ఊసేలేదు. రాజకీయ మార్పు తెస్తా అని హడావుడి చేసిన పవన్ కు మొదటి సారి ఎన్నికల్లో ఇలా చేదు ఫలితాలు ఎదురవ్వబోతుండడం పెద్ద ఎదురుదెబ్బగానే కనిపిస్తోంది. ఎంపీ సీట్ల అంచనాకే పరిమితమైన జాతీయ మీడియా సంస్థలన్నీ టీడీపీ, వైసీపీ సీట్లనే పరిగణలోకి తీసుకున్నాయి. జనసేనకు ఒక్క స్థానం కూడా వస్తుందని చెప్పలేదు. దీంతో జనసేన కార్యకర్తల్లో నిరాశ అలుము కుంది. 

అయితే, తమకు సైలెంట్ ఓటింగ్ పడిందని, మే 23 ఫలితాల తర్వాతే స్పందిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే జాతీయ సర్వేల్లో పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఇండియా టుడే – మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ అంచనాలో వైసీపీకి 18 నుంచి 20 సీట్లు వస్తాయని , టీడీపీకి కేవలం నాలుగు నుంచి ఆరు సీట్లు మాత్రమే వస్తాయని తేల్చింది. అయితే జనసేనను పరిగణలోకి తీసుకోలేదు. అలాగే టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ లో కూడా వైసీపీకి 18 సీట్లు, టీడీపీకి 7 సీట్లు వస్తాయని తేల్చింది. అలాగే న్యూస్‌ 18- ఐపీఎస్‌ఓఎస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం వైసీపీకి 13-14 సీట్లు, టీడీపీకి 10-12 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే జాతీయ సర్వేల్లో జనసేన ప్రస్తావన లేకుండా ఉండడం ఆ పార్టీలో అయోమయం సృష్టించింది. మరి పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.