MoviesUncategorized

మెగా బ్ర‌ద‌ర్స్ ఎప్పుడు ఏం చేయబోతున్నారు?

పాపం పవన్ కళ్యాణ్ తానొకటి తలిస్తే ఓటర్లు మరొకటి తలిచారు. ఫలితంగా ఎన్నిక‌లలో మెగా బ్ర‌ద‌ర్స్ ఓడిపోయారు. జనసేన తరపున తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోనే గెలిచింది. ఇక పవన్ పోటీచేసిన గాజువాక‌, భీమ‌వ‌రం లలో ఓట‌ర్లు ఓడించారు. అలాగే న‌ర‌సాపురం పార్లమెంట్ స్థానంలో నాగ‌బాబు ని ఓడించారు. చాలా పెద్ద దెబ్బ తగలడంతో రాజ‌కీయాల్లో ‘మెగా’ అంకం ఇక ప‌రిస‌మాప్త‌మైన‌ట్టే అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవు. ఐదేళ్ల పాటు ‘జ‌న‌సేన‌’ని కాపాడు కోవడం కూడా ప‌వ‌న్‌ కి సాధ్యం కాదని అంటున్నారు. 

మ‌రి ఇప్పుడు మెగా బ్రదర్స్ ఇద్దరూ ఏమి చేయబోతున్నారని అందరిలో చర్చ నడుస్తోంది. ప‌వ‌న్ ఇప్ప‌టికీ సినిమాల్లో సూప‌ర్ స్టారే. అత్య‌ధిక పారితోషికం తీసుకున్న క‌థానాయ‌కుల్లో ప‌వ‌న్ ఒక‌డు. సినిమాల్లో త‌న క్రేజ్ ఇంకా త‌గ్గ‌లేదని చెప్పడానికి సినిమాలు చేయాలన్న వత్తిడి ఫాన్స్ నుంచి వస్తూండడమే కారణం. దానికి తోడు ప‌వ‌న్ చేతిలో అడ్వాన్సులు కూడా ఉన్నాయి. మైత్రీ మూవీస్ సంస్థ‌కి ప‌వ‌న్ ఓ సినిమా చేయాలి. దాంతో పాటు మ‌రో నిర్మాత కూడా ఇప్ప‌టికే వ‌వ‌న్‌కి అడ్వాన్స్ ఇచ్చాడు.

ఈ రెండు సినిమాలు చేద్దామ‌ని ప‌వ‌న్ డిసైడ్ అయిపోతే – మ‌రో రెండేళ్ల పాటు ప‌వ‌న్ బిజీగా ఉంటాడు. ఆ త‌ర‌వాత‌, ఓపిక ఉంటే మ‌ళ్లీ జ‌న‌సేన పార్టీ గురించి ఆలోచించొచ్చు. నాగ‌బాబు విషయానికి వస్తే ఎన్నాళ్ళ నుంచో చేస్తున్న ‘జ‌బ‌ర్‌ద‌స్త్‌’ షో ఉంది. నిజానికి ఈ షోతోనే నాగ‌బాబు బుల్లి తెర ప్రేక్ష‌కులు బాగా కనెక్ట్ అయ్యాడు. `ఎంపీ అయినంత మాత్రాన జ‌బ‌ర్‌దస్త్ షో వ‌ద‌ల‌ను` అని కూడా నాగ‌బాబు అప్ప‌ట్లోనే చెప్పేశాడు.ఇక న‌టుడిగానూ త‌ను బిజీనే. న‌ర‌సాపురం ఎంపీగా ఓట‌మి తర్వాత, మ‌రోసారి ఎన్నిక‌ల్లో అడుగుపెట్టే సాహ‌సం నాగ‌బాబు చేయ‌క‌పోవొచ్చు. జ‌బ‌ర్‌ద‌స్త్ జ‌డ్జ్‌గా, స‌హాయ న‌టుడిగా.. ఆయ‌న బిజీ గా మారిపోతే ఈ ఓట‌మి ని ఈజీగా మర్చిపోవచ్చని అంటున్నారు.