వరల్డ్ కప్ గెలిస్తే ఏకంగా రూ. 28 కోట్ల ప్రైజ్ మనీ
2019 ప్రపంచ కప్ వేడుకకు సర్వం సిద్ధమైంది. మే 30 నుంచి ఇంగ్లండ్ వేల్స్‌లో టోర్నీ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 12వ సీజన్ ముగియడంతో అందరి కళ్లు ఇప్పుడు ప్రపంచ కప్ మీదే ఉన్నాయి. కొందరు ఆటగాళ్లు కుటుంబంతో కలిసి హాలీడే ట్రిప్‌లో ఉండగా.. మరికొందరు ఆట కోసం గట్టి కసరత్తు చేస్తున్నారు. ఈసారి కప్ అందుకోబోయే జట్టుకు ఐసీసీ భారీ నజరానా ప్రకటించింది. విజేతగా నిలిచిన జట్టుకు అత్యధికంగా నాలుగు మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో రూ.28 కోట్లు) ఇస్తామని ప్రకటించింది.
రన్నరప్‌కు రెండు మిలియన్ డాలర్లు(రూ.14 కోట్లకుపైగా), సెమీఫైనల్లో ఓటమిపాలైన రెండు జట్లకు చెరో 8 లక్షల డాలర్లు(దాదాపు రూ.5కోట్లకుపైగా) అందుతుంది. ఇక లీగ్ దశలో గెలిచే ప్రతి మ్యాచ్‌కు 40 వేల డాలర్ల చొప్పున విజేతలు గెలుచుకోనున్నారు. లీగ్ దశలోనే ఓడిపోయిన ప్రతీ జట్టుకు లక్ష డాలర్లు నగదు నజరానాగా అందనుంది.
వరల్డ్ కప్‌లో భాగంగా మొత్తం 45 మ్యాచ్ రౌండ్ రాబిన్ పద్దతిలో జరుగుతాయి. వరల్డ్ కప్ మే 30వ తేదీన ప్రారంభమై.. జూలై 14వ వరకు కొనసాగనుంది. ప్రతీ జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాలి. లీగ్‌దశ ముగిసేసరికి ఎవరైతే తొలి నాలుగు స్థానాల్లో నిలుస్తారో వారే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. జులై 9న ఎడ్జ్‌బాస్టన్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్‌లో ఒక సెమీఫైనల్, 11న ఎడ్జ్‌బాస్టన్‌లోని బర్మింగ్‌హామ్‌లో మరో సెమీఫైనల్ జరుగుతుంది. జులై 14న లార్డ్స్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇరవై ఏళ్ల తర్వాత లార్డ్స్‌లో మళ్లీ వరల్డ్ కప్ జరగనుంది.