విజయ నిర్మల గురించి ఈ విషయాలు మీకు తెలుసా…. నమ్మలేని నిజాలు
తమిళనాడులో 1946 ఫిబ్రవరి 20న జన్మించారు. తెలుగువారే అయినప్పటికీ తమిళనాడులో స్థిరపడిన కుటుంబం వారిది. ఏడేళ్ల చిరుప్రాయంలో బాలనటిగా తమిళ చిత్రం మత్స్య రేఖతో సినిమాల్లోకి వచ్చారు. పదకొండేళ్ల వయసులో పాండురంగ మహత్యం చిత్రం ద్వారా ఆమె తెలుగు తెరకు పరిచయమయ్యారు.
అలా మొదలైన ఆమె ప్రయాణం రంగుల రాట్నం చిత్రంతో కథానాయకిగా పరిచయమయ్యారు. అది మొదలు ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. సుమారు 200లకు పైగా తెలుగు.. తమిళ.. మలయాళ చిత్రాల్లో నటిగా మెప్పించారు. పెళ్లికానుక సీరియల్ ద్వారా బుల్లితెరలోనూ నటించారు.
మరే నటికి లేని ఒక ప్రత్యేకత విజయనిర్మల సొంతం. నటిగా ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన ఆమె.. దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో ఆమె పేరు నమోదైంది. ప్రపంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా ఆమె పేరు నమోదైంది. 44 చిత్రాలకు ఆమె దర్శకత్వం చేశారు.
1971లో విడుదలైన ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా ప్రయాణాన్ని స్టార్ట్ చేసిన ఆమె 2009 వరకు మొత్తం 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఆమె దర్శకురాలిగా వ్యవహరించారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన నేరము-శిక్ష (2009) చిత్రం దర్శకురాలిగా ఆమె చివరి చిత్రం.
వ్యక్తిగత విషయాలకు వస్తే మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు నరేష్ ఒక్కరే సంతానం. ప్రముఖ నటి జయసుధకు విజయనిర్మల పిన్ని. ఆసక్తికరమైన మరో విషయం ఏమంటే.. ఆమె అసలు పేరు నిర్మల. అయితే.. తనకు తొలి అవకాశం ఇచ్చిన విజయ సంస్థ వారి గుర్తుగా ఆమె తన పేరును విజయనిర్మలగా మార్చుకున్నారు. తెలుగు సినిమా రంగానికి సంబంధించినంత వరకు విజయనిర్మల ఒక చరిత్ర. ఆమెలాంటి వారు ఇప్పుడే కాదు.. ఎప్పటికి రాలేరని చెప్పక తప్పదు. ఆమె మాదిరి సినిమాల్లో.. టీవీలో నటించటమే కాదు.. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించటం ఆమెకు మాత్రమే సాధ్యమని చెప్పక తప్పదు. ఆమె రికార్డులు చెరిగిపోయే ఛాన్స్ అతి తక్కువని చెప్పొచ్చు.