Devotional

పూరి జగన్నాథ్ రధ యాత్ర విశిష్టత

ఆలయాల్లో రథోత్సవాలు సర్వసామాన్యమైనా, పూరీ జగన్నాథ రథయాత్రకు ఉన్న ప్రసిద్ధి ఇంకెక్కడా కనిపించదు. ఇది కేవలం ప్రాచుర్యం వల్లనే కాదు. రథ నిర్మాణ, యాత్రాది విధానాల్లో పూరీకే ప్రత్యేకమైన అనేక అంశాలు విశేష ఆసక్తి కలిగిస్తాయి, అబ్బురపరుస్తాయి. బ్రహ్మపురాణ, పద్మపురాణ, స్కంద పురాణాలు పూరీ క్షేత్ర వైభవాన్ని, రథయాత్ర విశిష్టతను వివరించాయి. స్కంద పురాణంలోని ‘పురుషోత్తమ ఖండం’ ఈ క్షేత్ర సంబంధమైన విశేషాల్ని విస్తారంగా తెలియజేస్తుంది

ఉత్సవ విగ్రహాలు కాకుండా సాక్షాత్తు మూలవిరాట్టులే రథాల్ని అధిరోహించడం ఇక్కడి ప్రత్యేకత. ఈ రథాల్ని ప్రతి ఏటా కొన్ని ప్రత్యేక శాస్త్ర పద్ధతులు, నియమాలతో నిర్మించడం మరో విశిష్టత. ఇక్కడ దారు విగ్రహాలు మూలమూర్తులుగా తేజరిల్లుతాయి. అంతేకాక, వీటిని పన్నెండేళ్లకు ఓ మారు ‘వన కళేబరోత్సవం’ పేరిట ప్రాచీన శాస్త్ర సంప్రదాయాల అనుసారంగా నూతనంగా మలచడం- ఇంకెక్కడా కానరాని ఇంకో వైశిష్ట్యం.

ప్రధాన మందిరం నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్రా మూర్తుల్ని తీసుకొస్తారు. ఆ మూర్తుల్ని మూడు వేర్వేరు రథాలపై అధిరోహింపజేస్తారు. అర్చనలు జరిపి వూరేగింపునకు సిద్ధపరుస్తారు. కాల (నలుపు) వర్ణంలోని జగన్నాథుడిని, ధవళ వర్ణుడైన బలభద్రుడిని, పీత (పసుపు) వర్ణ అయిన సుభద్రాదేవిని రుగ్వేద, యజుర్వేద, సామవేద స్వరూపాలుగా సంభావిస్తారు.

సుదర్శన దేవుడి రూపాన్ని ఒక స్తంభాకారపు కర్రపై వృత్తాకారంగా మలు స్తారు. మూడు మూర్తులతో పాటు, జగన్నాథ సన్నిధిలో ఉంచుతారు. ఆయన అధర్వ వేద స్వరూపుడని పురాణాలు వర్ణించాయి. ఓంకార రూపుడైన భగవంతుడు నాలుగు వేదాల ఆకారాలుగా భక్తుల ఆరాధనలు అందుకోవడం మరింత ప్రత్యేకత సంతరించుకున్న అంశం. పూర్ణ అవతారమైన వాసుదేవ బ్రహ్మమే జగన్నాథుడు. అంశావతారం బలభద్రుడై, విష్ణు సోదరి పరాశక్తి సుభద్ర రూపమై ముమ్మూర్తులుగా పూజలందుకునే క్షేత్రమిది. వివిధ వర్ణాల అలంకారాలతో భాసిల్లే మూడు రథాల్ని సౌందర్య సాకారాలుగా భావిస్తారు. అద్భుతాలకు ఆధారాలుగానూ అవి కనిపిస్తాయి.

మూడు రథాలూ ప్రధాన ఆలయం నుంచి ఒకదాని వెంట ఒకటి కదులుతాయి. మంగళవాద్యాలతో, భజన గీతాలతో భక్తజనులు తాళ్లు పట్టి లాగుతారు. రథాలు విశాల మార్గమైన ‘బడదండ’ (బొడొదొండొ)పై వూరేగుతూ, రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే గుండిచా మందిరానికి చేరుకుంటాయి. ఆషాఢ శుద్ధ విదియనాడు రథయాత్ర ప్రారంభమవుతుంది. అవి గుండిచా నుంచి తిరుగు ప్రయాణం(మారు రథయాత్ర)తో, ఏకాదశి నాడు మళ్లీ ప్రధాన మందిరానికి చేరుకుంటాయి. ఈ మధ్యకాలంలో గుండిచా మందిరంలో కొలువుతీరుస్తారు. దశావతారాల్ని అలంకారాలుగా ప్రకటించి, భక్తులకు దివ్యానందం కలిగించి, ధన్యుల్ని చేస్తారు.

రథం దాదాపు 45 అడుగుల ఎత్తుతో ఉంటుంది. అంతే పరిమాణంలో విస్తారంగా, 16 చక్రాలు కలిగి ఉంటుంది. ‘నందిఘోష’ అని పిలిచే ఈ జగన్నాథ రథం అతి పెద్దది. ‘తాళధ్వజ’ పేరున్న బలభద్ర రథం పద్నాలుగు చక్రాలతో ఉంటుంది. ఎరుపు, నీలం రంగుల వస్త్రంతో, సుమారు 43 అడుగుల ఎత్తుతో భక్తులకు కనువిందు చేస్తుంది. పన్నెండు చక్రాలతో పాటు ఎరుపు, నలుపు వన్నె వస్త్రాలతో, నలభై రెండు అడుగుల ఎత్తుతో విరాజిల్లే సుభద్ర రథం పేరు ‘దర్ప దళన’. ఈ రథానికి దేవదళన, పద్మధ్వజ అనే నామాంతారాలు ఉన్నాయి.

మూలమూర్తులను జ్యేష్ఠ పూర్ణిమ నాటి స్నానయాత్రలో గుప్తంగా ఉంచుతారు. ప్రత్యేక పూజలు, అలంకారాలతో ఆషాఢ శుద్ధ విదియనాడు ప్రజలకు దర్శనభాగ్యం కలిగిస్తారు. రథయాత్రకు అనుకరణ యాత్రల్ని అంతర్జాతీయంగా నిర్వహిస్తుండటం, ఈ ఉత్సవాల ప్రాశస్త్యాన్ని తెలియజెబుతుంది!