Devotional

గోల్కొండ నుంచి బోనాల జాతర ప్రారంభం

భాగ్య నగరంలో బోనాల జాతర ప్రారంభమైంది. గోల్కొండ కోటలో కొలువైన శ్రీ జగదాంబ అమ్మవారికి గురువారం (జులై 4) ఉదయం భక్తులు తొలి బోనం సమర్పించారు. అంతకుముందు టోలీచౌకీ నుంచి ఫలహార ర్యాలీ ప్రారంభమైంది. మార్గమధ్యంలోని పూజారి ఇంటి వద్ద అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఘటాలను ఊరేగింపుగా తీసుకొచ్చి కొండపై ఉన్న అమ్మవారికి సమర్పించారు. డప్పు చప్పుళ్ల హోరు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు, యువత కేరింతలతో బోనాల పండుగ ఘనంగా ప్రారంభమైంది. 

తెలంగాణలో గోల్కొండ బోనాలతో ఆషాఢమాస బోనాల జాతర ప్రారంభమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు ఈ బోనాల ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆషాఢం నుంచి శ్రావణ మాసం వరకు ఈ జాతర కొనసాగుతుంది. జంటనగరాల్లో మాత్రం ఆషాఢ మాసంతో బోనాల జాతర పూర్తవుతుంది. ఒక్కో వారం నగరంలోని ఒక్కో ప్రాంతంలో నెల రోజుల పాటు బోనాల జాతర సాగుతుంది.