Movies

‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి… ఆమె కుటుంబ నేపథ్యం ఏమిటి?

తమన్నా సింహాద్రి అసలు పేరు సింహాద్రి మస్తాన్. హిందూ కుటుంబమే. కాకపోతే గుంటూరులోని దర్గాలో ఆమె తల్లిదండ్రులు మొక్కుకున్నారట. అందుకని మస్తాన్ అని పేరు పెట్టారు. ఆమెది కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతం. తండ్రిపేరు సింహాద్రి నాగేశ్వరరావు. ఈయన రైతు. తమన్నా పెదనాన్న సింహాద్రి సత్యనారాయణ అప్పట్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. పుట్టుక మగ అయినా చిన్నప్పటి నుంచి మస్తాన్‌కు ఆడపిల్లగా ఉండాలనే కోరిక ఉండేది. ఈ విషయం ఆమెనే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. సినిమాలంటే పిచ్చి. అందంగా కనిపించాలని, సినిమాల్లో నటించాలని కోరిక. 

తన కోరికను తీర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చింది. సినిమాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ, ఫలితం లేదు. దీంతో కొన్ని పరిచయాలతో అక్కడి నుంచి ముంబై వెళ్లిపోయింది. అక్కడ పూర్తిగా ఆడపిల్లలా మారిపోయింది. అదే, శస్త్రచికిత్స చేయించుకుంది. చాలా అందంగా తయారైంది. మస్తాన్‌ పేరును తమన్నాగా మార్చుకుంది. ముంబైలో ఓసారి వీకేర్ కంపెనీ నిర్వహించిన ఫ్యాషన్ షోలో పాల్గొంది. ఈ షోలో ప్రథమ బహుమతి తనకే వచ్చిందని తమన్నా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ముంబైలో పరిస్థితులు నచ్చక.. సొంత రాష్ట్రానికి వెళ్లిపోవాలనే కోరికతో మళ్లీ హైదరాబాద్‌కు వచ్చేసింది. 

హైదరాబాద్ వచ్చాక నటి శ్రీరెడ్డితో తమన్నాకు పరిచయం ఏర్పడింది. శ్రీరెడ్డి వివాదం సమయంలో ఆమె ఉద్యమానికి సహకరించింది. ఆ తరవాత శ్రీరెడ్డితో చెడి ఆమె నుంచి దూరంగా వచ్చేసింది. శ్రీరెడ్డిపై విమర్శలు గుప్పించింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్‌కు తమన్నా వీరాభిమాని. అప్పట్లో పవన్ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బహుశా ఈ విషయంలో శ్రీరెడ్డికి, తమన్నాకు మధ్య విభేదాలు వచ్చి ఉండొచ్చు. 

శ్రీరెడ్డి వివాదం ద్వారా రెండు మూడు సార్లు టీవీలో కనిపించిన తమన్నా.. ఈ క్రేజ్‌ను కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయిపోయింది. దీనికి ఆమెకు మంచి అవకాశం కూడా దొరికింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు వచ్చాయి. జనసేన నుంచి మంగళగిరిలో పోటీకి దిగాలని చూసింది. కానీ, వామపక్షాలతో పొత్తులో భాగంగా మంగళగిరి సీటును పవన్ కమ్యూనిస్టులకు ఇచ్చేశారు. దీంతో తమన్నా ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగింది. అప్పటి మంత్రి నారా లోకేశ్‌పై తమన్నా పోటీకి దిగడంతో మీడియా బాగా ప్రచారం చేసింది. లోకేశ్‌పై ట్రాన్స్‌జెండర్ పోటీ అంటూ తమన్నాను ఆకాశానికి ఎత్తేసింది. తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే తమన్నాకు 50 ఓట్లు కూడా రాలేదు. 

ఎమ్మెల్యేగా పోటీచేసిన తమన్నాకు ఓట్లు రాకపోయినా ప్రచారం మాత్రం బాగా వచ్చింది. ఆ ప్రచారం ఇప్పుడు కలిసొచ్చింది. ఈ క్రేజ్‌ను పరిగణనలోకి తీసుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు ట్రాన్స్‌జెండర్‌కు అవకాశం ఇచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి అడుగుపెట్టిన తమన్నా ఏం చేస్తుందో చూడాలి. మగాళ్లు, ఆడాళ్లు మధ్య ఈ ట్రాన్స్‌జెండర్ ఎలా ఉంటుందో.. లేక వాళ్లను ఎలా ఇబ్బంది పెడుతుందో చూడాలి. ఇంతకీ, ఈమెను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారో లేదో కూడా అనుమానమే. ఏపీ ఎలక్షన్ పద్ధతిలో ప్రేక్షకులు తీర్పు ఇస్తే వీలైనంత తొందరగా తమన్నా హౌజ్ నుంచి బయటికి వచ్చేస్తుంది.