జాతీయ జెండా చరిత్ర ఏమిటో తెలుసా ?
ప్రపంచ దేశాలలో పుణ్యభూమిగా పేరుగాంచిన భారతదేశానికి చెరిగిపోని చరిత్ర ఉంది. సరిగ్గా 250 సంవత్సరాల క్రితం ప్రపంచంలోకెల్లా అత్యధిక సంపన్న దేశంగా పేరుప్రఖ్యాతలతో, సుఖ సంతోషాలతో ఒక వెలుగు వెలుగుతున్న మన దేశాన్ని ఒక చిన్న వానలా మొదలై సునామిలాగా మన దేశాన్ని కప్పేసిన బ్రిటిష్ కంపెనీ కొన్ని సంవత్సరాలు వెనక్కు నెట్టేసింది. మన సంపదనంతా దోచేసింది. దాదాపు 200 సంవత్సరాల పాటు వారి పరిపాలనలో మన దేశ ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవించారు. మన దేశ ఆడపడుచులు, సామాన్యులు ఎన్నో భాధలు పడ్డారు. ఎందరో వీరులు వారి ప్రాణాలను సైతం ఈ దేశానికి అంకితం ఇచ్చి చరిత్రలో నిలిచిపోయారు.
ఎంతోమంది జైలు జీవితం, కొరడా దెబ్బలు, తూటాలు, నిరాహార దీక్షలు లాంటి ఎన్నో ఆటుపోట్లు చవిచూసాక మాత్రమే ఆ బ్రిటిష్ రాక్షస పరిపాలన నుండి మన దేశానికి విముక్తి కలిగింది. అప్పుడే బ్రిటిష్ ప్రభుత్వ జెండాను ఎర్రకోటమీద నుండి దింపి మన భారత జాతీయ జెండాను ప్రవేశపెట్టారు. భారత జాతీయ జెండా దినోత్సవం సందర్భంగా మన జాతీయ జెండా ప్రతిష్ట గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుతో మధ్యలో అశోక చక్రంతో నిర్మాణం చేసిన మన జెండాను భారత జాతీయ జెండాగా 1947 జులై 27 న నిర్వహించిన రాజ్యాంగ సభలో ఆమోదించారు. మన దేశ జాతీయ పతాకాన్ని భారత త్రివర్ణపతాకం అని కూడా అంటారు. మన జెండాలో వరుసగా కాషాయం, తెలుపు మరియు ఆకుపచ్చ రంగులు సమానమైన నిష్పత్తిలో ఉంచి మధ్యలో 24 ఆకులతో ఆకాశనీలం రంగులో అశోకచక్రం ఉంటుంది. భారతీయులకు జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగిళి వెంకయ్య గారు మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే.