Independence DayUncategorized

భారతదేశ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి గురించి ఈ విషయాలు తెలుసా?

స్వతంత్ర భారతావనికి మువ్వన్నెల పతాకాన్ని రూపకల్పన చేసిన మన తెలుగు తేజం పింగళి వెంకయ్య జన్మదినం నేడే. పింగళి వెంకయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి దగ్గర్లో ఉన్న మొవ్వ మండలములోని భట్లపెనుమర్రు గ్రామంలో హనుమంతరాయుడు మరియు వెంకరత్నమ్మ దంపతులకు 02 ఆగస్టు 1878న జన్మించాడు. వెంకయ్య చిన్నప్పటి నుండే చాలా చురుకైన వాడు. ప్రాథమిక విద్యను చల్లపల్లిలో, మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాలలోనూ విద్యనభ్యసించాడు. ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసుకుని సీనియర్ కేంబ్రిడ్జ్ చేయుటకు కొలంబో వెళ్లాడు. 19 ఏళ్ల వయస్సులో దేశభక్తితో దక్షిణాఫ్రికాలో జరిగిన బోయర్ యుద్ధంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. అక్కడే మహాత్మా గాంధీని కలిశాడు. అక్కడ ఏర్పడిన సాన్నిహిత్యం అర్ధశతాబ్దం పాటు కొనసాగింది.


1913 నుండి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై జాతీయ జెండా రూపకల్పన గురించి నాయకులందరితోనూ చర్చించాడు. 1916లో “భారతదేశానికొక జాతీయజెండా” అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించాడు. అదే సంవత్సరం లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య రూపొందించిన జాతీయ జెండానే ఎగురవేసారు. అయితే 1919లో జలంధర్‌కి చెందిన లాలా హన్స్‌రాజ్ ఆ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా, గాంధీ 1921లో బెజవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాల్లో వెంకయ్యను పిలిచి, కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిసి మధ్య రాట్నం ఉండేలా జెండా చిత్రించమని కోరాడు. గాంధీ సూచన ప్రకారం వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించాడు.


అలా రూపొందించబడిన జెండాలో కాషాయం హిందువులను, ఆకుపచ్చ ముస్లింలను సూచిస్తుంది, అంటే ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే ఆశయంలో ఆకుపచ్చను కూడా అందులో చేర్చారు. ఇక మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని గుర్తుచేస్తుంది. కార్మిక కర్షకులపై ఆధారపడిన భారతావని సత్యాహింసలను ఆచరించడం ద్వారా సుభిక్షంగా ఉంటుందనే ఆశయంతో జాతీయజెండా రూపుదిద్దుకుంది.

1947, జూలై 22వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ, అందులోని రాట్నం తొలగించి, అశోక ధర్మచక్రాన్ని చిహ్నంగా చేర్చారు. ఇది మన పూర్వ సంస్కృతికి సంకేతం. ఈ ఒక్క చిన్న మార్పు తప్ప పింగళి రూపొందించిన జెండా నేటికీ ఏమీ మార్పు లేదు. పింగళి ఆఖరి రోజుల్లో చాలా దారిద్ర్యంలో జీవించారు. చివరకు పూరి గుడిసెలో నివాసం ఉండవలసిన పరిస్థితి వచ్చింది. 1963వ సంవత్సరం జూలై 4వ తేదీన కన్నుమూసారు. వెంకయ్య తన చివరి కోరికగా ఆ జాతీయ జెండాను తన పార్థీవదేహంపై కప్పమని కోరి, ఆ తర్వాత ఆ జెండాను రావిచెట్టుకు కట్టవలసిందిగా కోరాడు. వెంకయ్య నిరాడంబర, నిస్వార్థ జీవితాన్ని గడిపి ఈ తరాలకు మార్గదర్శకులయ్యారు.