Movies

అద్దె కోసం వచ్చిన వ్యక్తి ఇంటిని కాజేయటంతో రోడ్డు పాలైన ఛాయాదేవి

తెలుగు చిత్ర సీమలో రెండు పాత్రలు జనానికి ఎప్పటికీ గుర్తిండిపోతాయి. గయ్యాళి అత్తల పాత్రల్లో సూర్యకాంతం,ఛాయాదేవి పోటీపడి నటించారు. కోడళ్లను చిత్రహింసలు పెట్టడంలో వారి నటన అమోఘం. అయితే నిజ జీవితంలో వీరిద్దరూ చాలా మంచిగా ఉండేవారు. ఇద్దరిదీ వెన్నలాంటి మనసు అని చాలా దగ్గర నుంచి చూసినవాళ్లు చెబుతుంటారు. ఇందులో ఛాయాదేవి విషయానికి వస్తే,సినిమాలో గయ్యాళి పాత్రలో నటిస్తూ,సెట్ లో మాత్రం సరదాగా,అల్లరి చేస్తూ,ఆమె చూపే ఆదరణ చూసి అందరూ ఆశ్చర్యపోయేవారట.

ఇక ఆకలి అని ఎవరైనా అంటూ చాలు రుచికరమైన భోజనం పెట్టె మంచి మనసున్న ఛాయాదేవి ఇంటికి ఎవరొచ్చినా సరే, ఇంట్లో ఏది ఉంటె అది పెట్టేవారట. అంతేకాదు ఎవరైనా కష్టాల్లో ఉంటె డబ్బిచ్చి ఆదుకునే గొప్ప మనసున్న మనిషని చెబుతారు. ఇక మద్రాసులో ఓ ఇల్లు కూడా తన కష్టార్జితంతో కొనుక్కుంది. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న ఛాయాదేవి సుబ్బారావు అనే వ్యక్తిని పెళ్లిచేసుకుందని కొందరు అంటారు. అయితే అతడు భర్త కాదని,ఆమె బాగోగులు చూస్తూ,సహజీవనం మాత్రమే చేసారని కొందరు అంటూంటారు.

ఇక పిల్లలు లేకపోతె,ఎవరినో పెంచుకుని పెళ్లి చేసి పంపించిన ఛాయాదేవి కి ఒక విధంగా తన మంచితనమే తన పాలిట శాపంగా మారిందని అంటారు. చాలామంది నిర్మాతలు ఫైనాన్స్ పేరిట ఆమె దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఎగ్గొట్టారట. తర్వాత ఇస్తామనినమ్మబలికి ముఖం చాటేసిన వాళ్ళే ఎక్కువ. ఇక సుబ్బారావు మరణంతో ఆమె తెలిసో తెలియకో షుగర్ వ్యాధిని లెక్కచేయలేదు. దాంతో మొదటగా కాలివేళ్ళను,ఆతరువాత కాలిని తీసెయ్యడంతో మంచానికి పరిమితం అయ్యారు. మరికొన్ని ఆరోగ్య సమస్యలు కూడా రావడం,మరోపక్క తన ఇంటి గురించి ఎవరో కోర్టుకి వెళ్లడం వంటి పరిణామాలతో ఇల్లు కూడా కోల్పోయారట. ఆస్తులన్నీ పోయాయి. తనను పలకరించేవాళ్లే కరువై, ఒక పూట భోజనానికి మొహం వాచారట. ఒక్క రూపాయికి దొరికే భోజనంతో కడుపు నింపుకోవాల్సి వచ్చిందట. చివరకు ఆమె దీనస్థితిలోనే కన్నుమూశారు.