జబర్దస్త్ లో నాగబాబు రీ ఎంట్రీకి బ్రేకులు…విమర్శలే శాపంగా మారాయా…?
మొన్నటి వరకూ జబర్దస్త్ కామెడీ షో అనగానే ముందుగా గుర్తొచ్చేది నాగబాబు, రోజాలే. అందుకే ఈ షోతో విడదీయరాని అనుబంధం ఉంది ఆ ఇద్దరికీ. అయితే ఈమధ్య ఈ షో నుంచి బయటకొచ్చిన నాగబాబు మళ్ళీ జబర్దస్త్ లో ఎంట్రీ ఇస్తారన్న వార్తలు ఊపందుకున్నాయి. అయితే రీ ఎంట్రీకి మల్లెమాల ప్రొడక్షన్స్ నో ఎంట్రీ అంటోందట. నిజానికి అప్పట్లో ఆరెంజ్ సినిమా తర్వాత నాగబాబు కెరీర్ పూర్తిగా డైలమాలో పడిపోయింది. ఆ సమయంలో అప్పుల బాధ తట్టుకోలేక నాగబాబు ఆత్మహత్య కూడా చేసుకుందామనుకున్నాడన్న పుకార్లు కూడా షికారు చేసాయి. సరిగ్గా అదే సమయంలో జబర్దస్త్ కామెడీ షో లో ఎంట్రీ ఇచ్చిన నాగబాబు కెరీర్‌కు మళ్లీ ఊపిరి పోసినట్లయింది.
అయితే లైఫ్ ఇచ్చిన షోను వదిలేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోకుండా మంచి పారితోషికం ఇస్తున్నారన్న కారణంగా బయటకు వచ్చేసి ఇప్పుడు అక్కడ కూడా ఫెయిల్ అయిపోయి మళ్ళీ జబర్దస్త్ కి రావాలనుకోవడం కొంత ఇబ్బందిగా మారిందన్న మాట వినవస్తోంది. జబర్దస్త్ షో వదిలేసి,జి తెలుగులో అదిరింది షోకి వెళుతున్నప్పుడే కొందరు నాగబాబుకు సలహాలు ఇచ్చినా సరే, ఆయన మాత్రం కాదనుకుని వెళ్లిపోయాడు. అదిరింది అంటూ జీ తెలుగులో మరో షో మొదలుపెట్టాడు. అయితే జబర్దస్త్ కామెడీ షోకు పోటీగా వచ్చినప్పటికీ, దాని ప్రభావం చాలా తక్కువే. అదే సమయంలో నాగబాబు లేకపోయినా కూడా జబర్దస్త్ మాత్రం దుమ్ము దులిపేస్తూనే ఉంది. రేటింగ్స్‌లో టాప్‌లోనే ఉంది. పైగా, అదిరింది షోకు రేటింగ్స్ తగ్గిపోతున్నాయి. ఇలాంటి సమయంలో మళ్లీ జబర్దస్త్ షోకు రావాలనే ఆలోచన నాగబాబు చేస్తున్నాడనే వార్తలొచ్చాయి. పైగా గెటప్ శ్రీను లాంటి వాళ్లు దీన్ని కన్ఫర్మ్ కూడా చేసారు.
కానీ మల్లెమాల నుంచి మాత్రం నాగబాబుకు ఎంట్రీకి నో ఎంట్రీ బోర్డ్ పెట్టినట్లు టాక్. ఆయన రావడం మల్లెమాలకు పెద్దగా ఇష్టం లేదట. నాగబాబు వెళ్లేప్పుడు మామూలుగా వెళ్లకుండా, మల్లెమాలపై చాలా విమర్శలు చేసాడు . ఏడేళ్లుగా జబర్దస్త్ కమెడియన్లకు చాలా అన్యాయం చేసారన్నట్లుగా చెప్పుకొచ్చాడు. పైగా కమెడియన్లు ఏమైపోయినా కూడా కేవలం లాభాలు మాత్రమే చూసుకున్నారంటూ మల్లెమాల సంస్థపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే మెగా బ్రదర్ రీ ఎంట్రీకి అడ్డుగా మారుతున్నాయని టాక్. జబర్దస్త్‌లో వారానికి ఓ కొత్త జడ్జి అంటే, మనో, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇలా ఒక్కో వారం ఒక్కొక్కరు దర్శనమిస్తున్నారు. జబర్దస్త్‌పై నాగబాబు చేసిన విమర్శలే ఇప్పుడు శాపంగా మారాయని టాక్.