Movies

విజయ్‌ దేవరకొండ ఆ ప్రెజర్‌ని తట్టుకోగలడా?

హీరో విజయ్‌ దేవరకొండ, ‘ది దేవరకొండ ఫౌండేషన్‌’ స్థాపించి, దాని ద్వారా ‘మిడిల్‌ క్లాస్‌ ఫండ్‌’ ఏర్పాటు చేసి, కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి ‘నిత్యావసర సరుకులు’ (ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయలకు లోబడి) అందిస్తోన్న విషయం విదితమే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయత్నిస్తున్నారు. నిజానికి, ఇలాంటివి ప్రభుత్వాలు చేయాల్సిన పనులు. ప్రభుత్వాలు ఇప్పటికే ఆ పని చేస్తున్నా, ఆ సహాయం అందరికీ సరిపోదన్నది నిర్వివాదాంశం. తనవంతుగా విజయ్‌ దేవరకొండ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందించి తీరాల్సిందే.

అయితే, వందలు, వేలు దాటి లక్షల సంఖ్యలో సాయం కోసం ఎదురుచూస్తున్నప్పుడు అలాంటివారిని ఆదుకోవడం విజయ్‌ దేవరకొండకు సాధ్యమయ్యే పనేనా.? ఆ ప్రెజర్‌ని విజయ్‌ దేవరకొండ తట్టుకోగలడా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిస్థితిని ముందే ఊహించిన విజయ్‌ దేవరకొండ, ‘ది దేవరకొండ ఫౌండేషన్‌’ కోసం ఫండ్‌ రైజింగ్‌ కూడా చేపట్టాడు. దాతల నుంచి విరాళాలు బాగానే అందుతున్నాయి. అయితే, అవైనా ఎంత కాలం కొనసాగుతాయి.? ఎంతమందికి సరిపోతాయి.? అన్న ప్రశ్నలొస్తున్నాయి. విజయ్‌ దేవరకొండ మాత్రమే కాదు, సినీ పరిశ్రమలో చాలామంది వివిధ మార్గాల్లో సాయం కోసం ఎదురుచూస్తున్నవారికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తుండడం అభినందనీయం.