MOTHERS DAY

అంతర్జాతీయ మాతృ దినోత్సవం (Mothers Day) ఎలా ప్రారంభం అయింది

కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తుతెచ్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం (ఎక్కువ దేశాలలో) నాడు జరుపుకుంటారు. ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్ దేశంలో నిర్వహించారు.

1872లో అమెరికాలో జూలియావర్డ్ హోవే అనే మహిళ తొలిసారిగా ప్రపంచశాంతి కోసం మాతృ దినోత్సవం నిర్వహించాలని ప్రతిపాదించి, బోస్టన్ లో సమావేశాలను కూడా ఏర్పాటు చేసింది. సివిల్ వార్ గాయాల స్మృతులను చెరిగిపోయేలా చేసేందుకు ‘మదర్స్ ఫ్రెండ్ షిప్’డే నిర్వహించిన అన్నా మేరీ జెర్విస్ అనే మహిళ 1905, మే 9న చనిపోయింది. ఆవిడ కూతురైన మిస్‌జెర్విస్ మాతృ దినోత్సవం నిర్వహించాలని బాగా ప్రచారం చేయడంతోపాటు తన తల్లి రెండవ వర్థంతి సందర్భంగా మే నెలలోని రెండవ ఆదివారంనాడు మాతృ దినోత్సవంను నిర్వహించింది.

అమెరికాలోనే తొలిసారిగా 1910లో వర్జీనియా రాష్ట్రంలో ఈ దినోత్సవాన్ని జరిపింది. జెర్విస్ చేసిన ప్రచారం ఫలితంగా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో ఈ దినోత్సవం జరపడం సంప్రదాయంగా మారింది. 1914లో నాటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ మాతృ దినోత్సవంను అధికారికంగా జరపాలని నిర్ణయించడంతోపాటూ, ఆ రోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించాడు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించి ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.