FOUNDATION:ముఖానికి ఫౌండేషన్ వేసుకొనే పద్దతి గురించి తెలుసుకుందాము
HOW TO APPLY FOUNDATION:అలంకరణలో అతి ప్రధానమైంది.. ఫౌండేషన్ ప్రక్రియ. దానిని ఎంచుకొనేటప్పుడు చర్మతత్వం, వాతావరణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే రకరకాల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. మొదటిసారి ఫౌండేషన్‌ను ఉపయోగించాలనుకునేవారు.. చర్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఆ తరవాత వీలైతే నిపుణుల సలహా మేరకు ఫౌండేషన్‌ను ఎంచుకోవాలి.
జిడ్డు చర్మతత్వం ఉన్నవారు లిక్విడ్, పౌడర్ రూపంలో లభ్యమయ్యే వాటిని వాడాలి. పొడి చర్మతత్వం వారికి క్రీమ్ ఆధారిత ఫౌండేషన్ బాగుంటుంది. ఇది పొడి చర్మానికి తేమనందిస్తుంది.
ముఖం మీద విపరీతంగా మొటిమలు, దద్దుర్లు ఉన్నట్లయితే ఫౌండేషన్ రాయకపోవడమే మంచిది. వాటికి తగిన శ్రద్ధ తీసుకొని నిపుణుల సలహా మేరకు వాడటం మేలు.
పొడి వాతావరణంలో లిక్విడ్ ఫౌండేషన్ చక్కటి ఎంపికవుతుంది. దానితోపాటు తప్పకుండా మాయిశ్చరైజర్ వాడాలి. అలానే కాంపాక్ట్ కూడా వాడవచ్చు. తేమగా ఉన్నప్పుడు అంటే వర్షం సమయంలో సాధ్యమైనంత వరకూ వేసుకోకపోవడమే మంచిది.
కొందరి చర్మతత్వానికి ఇది నప్పకపోవచ్చు.. అందుకు ముందుగానే చెవి వెనుక భాగంలో రాసి పరీక్షించుకోవాలి. అది రాసినప్పుడు దురదు, దద్దుర్లు లాంటివి వస్తే అసలు వాడకపోవడం ఉత్తమం.
ఫౌండేషన్‌ను చాలామంది చేతులతో రాస్తుంటారు. అలాంటి వారు ముందుగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే దానికి బదులు సున్నితమైన బ్రష్‌తోనూ వేసుకోవచ్చు. అలాగే ఇతరులు వాడిన బ్రష్ ఉపయోగించకూడదు.. వాటివల్ల చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.
నల్లమచ్చలు, మొటిమలు, స్పాట్స్ వంటివి ఎక్కువగా ఉన్నప్పుడు తప్పకుండా కన్సీలర్ వాడాలి. ఆ తరవాతే ఫౌండేషన్. తొలగించేటప్పుడు స్పాంజ్‌ని వాడాలి.
ఇది అతిగా వేసుకుంటే ముఖానికి పూత వేసినట్లు కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకూ తక్కువగా ఉపయోగించాలి. పొరబాటున ఎక్కువైతే బ్రష్‌తో పౌడర్ అద్దాలి. అప్పుడు అతిగా కనిపించదు.