ఎన్టీఆర్,కృష్ణ మధ్య విభేదాలకు కారణాలు ఏమిటో తెలుసా ?
దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించిన సూపర్ కృష్ణ గుంటూరు జిల్లా తెనాలి దగ్గర బుర్రిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి. ఇండస్ట్రీకి వచ్చి సూపర్ స్టార్ అయ్యాడు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరుపొందాడు. అయితే తెనాలి రత్న టాకీస్ లో చిన్నప్పుడు పాతాళభైరవి మూవీ చూసిన కృష్ణ అప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమానిగా మారాడు. సినిమాల్లో చేరడానికి మద్రాసు వెళ్ళినపుడు ముందుగా ఎన్టీఆర్ ని కలిసాడు. అయితే రెండేళ్లు నాటకాల్లో వేసాక రావాలని సూచించడంతో అలాగే చేసాడు. సినిమాల్లో చేరాక ఎన్టీఆర్ తో కల్సి స్త్రీ జన్మ మూవీలో నటించాడు. అందులో తమ్ముడి వేషం వేసిన కృష్ణ ఆతర్వాత దేవుడు చేసిన మనుషులు,వయ్యారి భామలు వగలమారి భర్తలు మూవీ దాకా ఎన్టీఆర్ తో కల్సి ఏ సినిమా చేసినా అందులో తమ్ముడుగానే కృష్ణ నటించాడు. అయితే ఇద్దరి మధ్యా గొడవలు రావడానికి పరిస్థితులే కారణం. పండంటి కాపురం మూవీ సిల్వర్ జూబ్లీకి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ వచ్చారు.
తన అభిమాన నటుడితో సినిమా తీయాలని ఉందని కృష్ణ ప్రకటించడం,దానికి ఎన్టీఆర్ ఒకే చెప్పడం అయింది. అయితే జై ఆంధ్ర ఉద్యమం అప్పుడే మొదలవ్వడంతో కృష్ణ మద్దతుగా ప్రకటన ఇచ్చాడు. ఇది ఎన్టీఆర్,అక్కినేనిలకు రుచించలేదు. దాంతో సినిమాకు దూరం అయ్యారు. కొన్నాళ్ల తర్వాత నిమ్మకూరులో హరికృష్ణ పెళ్ళికి ఆహ్వానం అందడంతో కృష్ణ వెళ్ళాడు. మద్రాసు తిరిగొచ్చాక సినిమా కు ఎన్టీఆర్ ఒకే చెప్పారు. అలా దేవుడు చేసిన మనుషులు సినిమా చేసారు. ఆ సినిమా అయ్యాక, తదుపరి అల్లూరి సీతారామరాజు సినిమా చేస్తున్నట్లు కృష్ణ ప్రకటించడంతో అప్పటికే ఈ సినిమా తీయాలని చూస్తున్న ఎన్టీఆర్ కి కోపం వచ్చేసింది. దాంతో దేవుడు చేసిన మనుషులు మూవీ శతదినోత్సవ వేడుకలకు ఎన్టీఆర్ దూరంగా ఉన్నారు.
ఇక సీతారామరాజు మూవీని కృష్ణ తీయడం,ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో అతడి సాహసాన్ని అందరూ మెచ్చుకున్నారు. అప్పటినుంచి ఇద్దరి మధ్యా మాటల్లేవు. 1975లో వాహిని స్టూడియోలో ఒకరికొకరు ఎదురుపడ్డంతో కృష్ణ పలకరించడం, ఎన్టీఆర్ కూడా మాట కలపడం అయింది. దాంతో అల్లూరి సీతారామరాజు మూవీని ప్రత్యేక షోగా వేయడంతో ఎన్టీఆర్ వీక్షించి బాగా చేసావ్ అని అభినందించడమే కాదు, కృష్ణ తీసిన సమాజానికి సవాల్ మూవీ ఓపెనింగ్ కి వచ్చాడు.
ఇక ఎన్టీఆర్ దాన వీర సూర కర్ణ మూవీ చేస్తుంటే,.. అందుకు పోటీగా కురుక్షేత్రం మూవీ కృష్ణ తీయడంతో పరిశ్రమ రెండుగా చీలింది. ఎన్టీఆర్ కి అక్కినేని అండగా నిలిస్తే, కృష్ణతో శోభన్ బాబు చేతులు కలిపాడు. 1977లో సంక్రాంతికి రిలీజైన ఈ మూవీస్ లో ఎన్టీఆర్ మూవీనే పైచేయిగా నిల్చింది. దాంతో ఇద్దరి మధ్యా మాటల్లేవు. ఇక యుగపురుషుడు మూవీ సమయంలో పక్కనే మరో షూటింగ్ లో ఉన్న కృష్ణ వచ్చి పలకరించడంతో పరిస్థితి చక్కబడింది.
తర్వాత వయ్యారి భామలు వగలమారి భర్తలు మూవీ ఇద్దరూ కల్సి నటించారు. ఎన్టీఆర్ సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి,తెలుగుదేశం పార్టీ పెట్టారు. అదే సమయంలో కృష్ణ ఈనాడు మూవీ తీయడం, అందులో ఒక పాటలో సైకిళ్ళు పై రావడం,తెలుగుదేశం గుర్తు కూడా అదే కావడంతో సపోర్ట్ గా తీసారని అనుకున్నారు. ఇక ఎన్టీఆర్ గెలిచాక కృష్ణ అభినందన ప్రకటన చేసారు. అయితే ఎన్టీఆర్ ని దించేసి నాదెండ్ల భాస్కరరావు సీఎం అయినపుడు ఆయన్ని కృష్ణ అభినందించడంతో ఎన్టీఆర్ శిబిరంలో కలకలం రేగింది.
దాంతో కృష్ణ సినిమాలు ప్రదర్శించే థియేటర్లపై ఎన్టీఆర్ ఫాన్స్ దాడులు చేయడం,పోస్టర్లు చించేయడం చేయడంతో ‘ఎవరు సీఎం గా ఉన్నా అభినందిస్తానే తప్ప,ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు’అని కృష్ణ ఓ ప్రకటన చేసాడు. అయినా వేడి చల్లారలేదు. కంచుకాగడా మూవీ ప్రదర్శించే థియేటర్లపై రాళ్లు పడ్డాయి. కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. మళ్ళీ ఎన్టీఆర్ సీఎం అవ్వడంతో పరిస్థితి సర్దుమణిగింది. తర్వాత రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా మూవీస్ తీసాడు. 1989లో ఏలూరు నుంచి కృష్ణ పోటీచేసి ఎంపీ అయ్యారు. అయితే రాజీవ్ మరణంతో రాజకీయాలకు దూరమయ్యాడు.