వేదం నాగయ్య,అనుష్క రిలేషన్ ఏమిటో తెలుసా?
vedam movie nagaiah :తెలుగు చిత్ర సీమలో నాగయ్య అనగానే చిత్తూరు వి నాగయ్య గుర్తొస్తారు. కానీ ఈ మధ్య కాలంలో ఓ సినిమాలో చేసిన నాగయ్య అనే వ్యక్తి కూడా ఉన్నారు. ఆయన మరణించడంతో ఆయన ఫోటోని సోషల్ మీడియాలో స్వీటీ బ్యూటీ అనుష్క శెట్టి షేర్ చేస్తూ, ఘనంగా నివాళుర్పించింది. కల్మషం లేని వ్యక్తి నాగయ్య అంటూ కీర్తించింది.
ఇంతకీ క్రిష్ వేదం సినిమాలో అనుష్క హీరోయిన్ గా చేసింది. అల్లు అర్జున్, మంచు మనోజ్ కూడా నటించిన ఈ మూవీలో మాదాసు నాగయ్య అనే వ్యక్తి నటించారు. ఆయన శనివారం కన్నుమూశారు. ఆయన వయస్సు 75సంవత్సరాలు. అనారోగ్య సమస్యతో మరణించడంతో వేదం సినిమా సమయంలో ఆయనతో తీయించుకున్న ఫోటో షేర్ చేసి మరీ అనుష్క నివాళులర్పించింది.
గుంటూరు జిల్లా నకరికల్లు మండలం దేచవరం గ్రామానికి చెందిన నాగయ్యకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఇక భార్య ఐదేళ్ల క్రితం పోయారు. గొడుగులు అమ్ముకుని జీవనం సాగించే నాగయ్య ఎలాంటి ట్రైనింగ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, ఆకట్టుకున్నాడు. స్పైడర్, రామయ్యా వస్తావయ్యా, నాగవల్లి వంటి సినిమాల్లో కూడా నటించారు. నాగయ్య అంత్యక్రియలు పూర్తవ్వడంతో చాలామంది సోషల్ మీడియాలో సంతాపాలు తెలిపారు.