ఈ టాలీవుడ్ కమెడియన్ చనిపోతే రిక్షాలో పడేసి లాక్కెళ్లారు!
సినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ ఉంటేనే ఏదైనా సాధ్యం! సక్సెస్ లేకపోతే ఎవరూ పట్టించుకోరు. అప్పటివరకు కలిసి తిరిగిన వాళ్లు కూడా మొహం చాటేసే పరిస్థితులు వస్తాయి. ఒకప్పుడు గొప్పగా వెలిగిపోయి అందరితో ప్రశంసలు అందుకున్న చాలామంది నటీనటులు చివరి దశలో ఎవరూ చేయూతనివ్వక దారుణమైన పరిస్థితుల్లో కన్నుమూయడం మనకు తెలిసిందే. అలాంటివారిలో ఐరన్ లెగ్ శాస్త్రి ఒకరు.అప్పట్లో బ్రహ్మానందం, ఐరన్ లెగ్ శాస్త్రి కాంబినేషన్ ఉందంటే నవ్వులు విరబూసేవి. భారీకాయంతో చూడగానే నవ్వు పుట్టించే ముఖంతో శాస్త్రి చాలా అవకాశాలు దక్కించుకున్నాడు. ఆ రోజుల్లో బ్రహ్మానందం, బాబూ మోహన్, ఆలీ తర్వాత ఐరన్ లెగ్ శాస్త్రి పేరే వినిపించేది. అయితే దురదృష్టం ఆయన్ను వెంటాడింది. ఆరోగ్యం క్షీణించడంతో అవకాశాలు తగ్గిపోయి చివరికి అత్యంత దయనీయ పరిస్థితుల్లో ప్రాణాలు విడిచాడు.
ఐరన్ లెగ్ శాస్త్రి అసలు పేరు గునుపూడి విశ్వనాథ శాస్త్రి. మొదట్లో సినిమా ముహూర్తాలకు పౌరోహిత్యం చేసేవాడు. అయితే దర్శకుడు ఈవీవీ ప్రోత్సాహంతో సినిమాల్లో నటిస్తూ కొద్దికాలంలోనే ఐరన్ లెగ్ శాస్త్రిగా ఇమేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా ఆయన ప్రత్యేకంగా కూడబెట్టిన ఆస్తిపాస్తులేమీ లేవు.
ఒక దశలో హెల్త్ బాగా దెబ్బతినడంతో శాస్త్రి తన స్వగ్రామం తాడేపల్లిగూడెం వెళ్లిపోయాడు. ఓవైపు సినిమా చాన్సులు లేక, మరోవైపు పౌరోహిత్యానికి ఎవరూ పిలవక దుర్భర దారిద్ర్యం అనుభవించాడు చివరికి శరీరం భారీగా పెరిగిపోయి పచ్చకామెర్ల వ్యాధితో మంచం పట్టాడు.ఆ సమయంలో భార్యాబిడ్డలు హైదరాబాద్ లో ఉంటే గుండెపోటుకు గురైన ఐరన్ లెగ్ శాస్త్రిని బంధువులు ఆసుపత్రిలో చేర్చారు. భార్య, కొడుకు వచ్చేసరికి ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
అయితే ఐరన్ లెగ్ శాస్త్రి మృతదేహాన్ని ఓ రిక్షాలో పడేసిన వైనం చూసి భార్య కళ్లు తిరిగి కిందపడిపోయిందట. ట్రైన్ దిగి నేరుగా ఆసుపత్రికి వెళుతున్న ఆయన భార్య, కుమారుడికి ఓ రిక్షాలో ఆయన శవం ఎదురొచ్చింది. ఆ సమయంలో తన తండ్రి మృతదేహం సగమే రిక్షాలో ఉందని, కాళ్లు చేతులు రిక్షా బయటికి వేలాడుతూ ఉన్నాయని, ఆ స్థితిలోనే ఆయన్ను రిక్షాల్లో లాక్కెళ్లడం చూసి తన తల్లి తట్టుకోలేపోయిందని ఐరన్ లెగ్ శాస్త్రి కుమారుడు ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
తండ్రి పోయాక తమను మేనత్త ఆదుకుందని, ఇండస్ట్రీ నుంచి కాదంబరి కిరణ్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కూడా చాలా సాయపడిందని చెప్పాడు. హీరో సంపూర్ణేష్ బాబు రూ.25 వేలు సాయం చేయగా, యువ హీరో సందీప్ కిషన్ కూడా తనవంతు సాయం అందిచారట.
ఐరన్ లెగ్ శాస్త్రి మరణంతో ఆయన భార్య కుటుంబాన్ని పోషించడం కోసం ఆలయాల్లో ప్రసాదం వండుతూ పేదరికంలో కొట్టుమిట్టాడుతోందని తెలుసుకున్న సంపూ తదితరులు అప్పట్లో ఆర్థికసాయం అందజేశారు. తాను సీఏ పూర్తిచేయడానికి కాదంబరి కిరణ్ గారు ఎంతో సాయపడ్డారని వెల్లడించాడు ప్రసాద్. ప్రస్తుతం కుటుంబంతో కలిసి హైదరాబాద్ లో ఉంటున్న ప్రసాద్ తండ్రి బాటలోనే నటనారంగంలో ప్రవేశించాడు. ప్రస్తుతం జంబలకిడిపంబ చిత్రంలో నటిస్తున్నాడు.