జిగేల్ రాణి సింగర్ కి ఊహించని పారితోషికం ఇచ్చిన సుకుమార్
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం మూవీ సూపర్ డూపర్ అయింది. ఇక అందులో జిగేల్ రాణి సాంగ్ అయితే సూపర్ డూపర్ హిట్ అయింది. చంద్రబోస్ సాహిత్యానికి దేవీశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటను టాలీవుడ్ టాప్ సింగర్ ఎవరో పాడారనుకుంటున్నారా? ఒకవేళ అలా అనుకుంటే పొరబడినట్లే. విశాఖ జిల్లా అనకాపల్లిలో చిన్న చిల్లరకొట్టు నడుపుకుంటుంటూ జీవనం సాగిస్తున్న గంటా వెంకట లక్ష్మి ఈ పాటను అద్భుతంగా ఆలపించారు.నిజానికి జిగేల్ రాణి సాంగ్ జిగేల్ మనిపించినా, ఆమెను మాత్రం తెరవెనుకకు పరిమితం చేసేసింది. చిల్లరకొట్టు నడుపుతూ వెంకట లక్ష్మి అప్పుడప్పుడు బుర్రకథలు చెప్పేది. యూట్యూబ్ లో ఆమె బుర్రకథ చూసిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఆమెకు రంగస్థలం లో జిగేల్ రాణి పాటను పడే అద్భుత అవకాశం ఇచ్చారు. ‘
అయితే ఈ పాటకోసం రెండు రోజులు చెన్నై వెళ్లి అక్కడే ఉండి , ఈ పాటను పాడివచ్చాను. కానీ నాకు ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వలేదు’అని వెంకట లక్ష్మి వాపోయింది.’జిగేల్ రాణి పాట పాడేందుకు మధ్యవర్తిగా విశాఖకు చెందిన నాగభూషణం అనే వ్యక్తి వున్నా, పాట పాడినందుకు మాత్రం ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. మాది చిన్న కుటుంబం. బుర్రకథలు మాకు ఆధారం. తనకు జరిగిన అన్యాయం గురించి హీరో రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ లకు తెలపాలని ప్రయత్నం చేశాను.
కనీసం రంగస్థలం 100 రోజుల ఫంక్షన్ కైనా పిలుస్తారేమోనని అనుకున్నాను. అయితే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా మధ్యవర్తి మోసం చేసాడు’అని వెంకటలక్ష్మి వాపోయింది.అయితే విషయం లేటుగా తెల్సుకున్న సుకుమార్ లక్ష రూపాయల చెక్కుని జిగేల్ రాణి సింగర్ వెంకట లక్ష్మికి పంపించి అండగా నిలిచారు. ఇక వందరోజుల వేడుకకు వెంకట లక్ష్మిని పిలవాలని అనుకున్నామని అయితే, ఆమె ఫోన్ నెంబర్ అందుబాటులో లేదని సుకుమార్ తెలిపారు.